ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక: 10 వేల మంది ఖాతాల్లోకి రూ.45 కోట్ల జమ

ఆంధ్రప్రదేశ్‌లోని ఇమామ్‌లు మరియు మౌజన్లకు రంజాన్ పండుగ వేళ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారి గౌరవ వేతనం నిమిత్తం ప్రభుత్వం రూ.45 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం ఇచ్చిన హామీ మేరకు, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల బకాయిలను ఒకేసారి చెల్లించాలని నిర్ణయించడం విశేషం.

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 5,000 మంది ఇమామ్‌లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్లు, అలాగే మరో 5,000 మంది మౌజన్లకు ఆరు నెలల బకాయిల కింద రూ.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పండుగ పూట బకాయిలు విడుదల కావడం పట్ల ముస్లిం మత పెద్దలు మరియు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులను నేరుగా ఇమామ్, మౌజన్ల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని అధికారులను ఆదేశించారు. గత కొంతకాలంగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రంజాన్ తోఫా పెద్ద ఊరటనిచ్చింది. పండుగకు ముందే బకాయిలు చెల్లించడం ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *