పుట్టా మహేశ్ డ్రగ్స్ వివాదం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం తొలిసారి అని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వ అండదండల వల్లే రాష్ట్రంలో మాదకద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించిన జగన్, ఇలాంటి అసాంఘిక శక్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరుగుతున్నా ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని జగన్ దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు. పాలకుల ఆలోచనా విధానం వల్లే నేరాలు పెరుగుతున్నాయని మండిపడిన ఆయన, ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ధ్వజమెత్తారు.

ఇదే సందర్భంలో తన భవిష్యత్తు కార్యాచరణను జగన్ ప్రకటించారు. త్వరలోనే ‘జగన్ 2.ఓ’ పేరుతో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలోనే పాదయాత్ర చేపడతానని వెల్లడించారు. కూటమి ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *