మోనాలిసా పెళ్లి వివాదం: ‘మైనర్’ అని అంకుల్ ఆరోపణ.. మ్యారేజ్ సర్టిఫికెట్‌తో చెక్ పెట్టిన వైరల్ గర్ల్!

కుంభమేళాలో తన కళ్లతో అందరినీ మాయం చేసి పాపులర్ అయిన మోనాలిసా భోస్లే, ఇటీవలే ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని కేరళలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహం చెల్లదని మోనాలిసా అంకుల్ విజయ్ భోస్లే ఆరోపించడం కలకలం రేపింది. మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమె 2009లో జన్మించిందని ఆయన వాదిస్తున్నారు. పాస్‌పోర్టులో వయసును కావాలనే మార్చారని, మేజర్ కాకముందే జరిగిన ఈ పెళ్లి చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఈ ఆరోపణలను మోనాలిసా తీవ్రంగా ఖండించారు. తన వివాహం చట్టబద్ధమేనని నిరూపించేందుకు కేరళ ప్రభుత్వం జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని, అందుకే తాను ఇష్టపడిన వ్యక్తిని పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నానని ఆమె గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళకు చెందిన కొందరు రాజకీయ నాయకుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై సినిమా రంగం కూడా స్పందించింది. మోనాలిసాను బాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. అయితే మోనాలిసా – ఫర్మాన్ దంపతులు ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు, తమకు అన్ని మతాలు సమానమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం మోనాలిసా మ్యారేజ్ సర్టిఫికెట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *