ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో బాటలోనే తాజాగా ఆకాశ ఎయిర్ కూడా చేరింది. విమాన ఇంధన (ATF) ధరలు విపరీతంగా పెరగడంతో, ఆ భారాన్ని ప్రయాణికులపై వేస్తూ టికెట్లపై ‘ఇంధన సర్ ఛార్జ్’ విధిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ కొత్త నిబంధన మార్చి 15 అర్ధరాత్రి నుంచి బుక్ చేసే అన్ని టికెట్లకు వర్తించనుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆకాశ ఎయిర్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే దూరాన్ని బట్టి ఒక్కో టికెట్‌పై రూ. 199 నుండి రూ. 1,300 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే, మార్చి 15 కంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులపై ఈ అదనపు భారం ఉండదు. నిర్వహణ ఖర్చులలో ఇంధనానిదే ప్రధాన వాటా కావడంతో, ఈ ధరల పెరుగుదల వల్ల సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని ఆకాశ ఎయిర్ వివరించింది.
ఇప్పటికే ఇండిగో సంస్థ మార్చి 14 నుండి టికెట్‌పై రూ. 425 నుంచి రూ. 2,300 వరకు, ఎయిర్ ఇండియా మార్చి 12 నుండి రూ. 399 చొప్పున సర్ ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ఆకాశ ఎయిర్ కూడా అదే బాట పట్టడంతో సామాన్య విమాన ప్రయాణికులకు జేబులు ఖాళీ కానున్నాయి. భవిష్యత్తులో ఇంధన ధరల తగ్గుదలని బట్టి ఈ సర్ ఛార్జీలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.