చంద్రకుమార్ బోస్ తెలిపిన వివరాల ప్రకారం, 2019లో తమ కుటుంబ సభ్యులు నేతాజీ వాడిన అసలైన టోపీని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. ఎర్రకోటలో ఏర్పాటు చేసిన నేతాజీ మ్యూజియంలో దీనిని పదిలపరచాలని కోరగా, ప్రధాని స్వయంగా దానిని ఒక గాజు పెట్టెలో ఉంచి ప్రదర్శనను ప్రారంభించారు. అయితే, గత కొన్నేళ్లుగా ఈ టోపీని దేశంలోని వివిధ మ్యూజియంలకు ప్రదర్శన నిమిత్తం పంపారని, తాజాగా ఎర్రకోట మ్యూజియంకు తిరిగి వచ్చిన టోపీని చూస్తే అది తాము ఇచ్చిన ఒరిజినల్ టోపీలా అనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై చంద్రకుమార్ బోస్ ప్రధాని మోదీకి లేఖ రాయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా తన ఆందోళనను పంచుకున్నారు. “మేము ఇచ్చిన అసలైన టోపీకి, ప్రస్తుతం మ్యూజియంలో ఉన్న దానికి స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. దీని ప్రామాణికతను నిర్ధారించడానికి వెంటనే దర్యాప్తు చేపట్టాలి” అని ఆయన డిమాండ్ చేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వస్తువుల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగడం దేశ చరిత్రను అగౌరవపరచడమేనని ఆయన పేర్కొన్నారు.
నేతాజీకి సంబంధించిన వస్తువులను భద్రపరచడంలో ప్రభుత్వం గతంలోనే చొరవ తీసుకుందని గుర్తు చేస్తూ, ఇప్పుడు తలెత్తిన ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంపై పురావస్తు శాఖ (ASI) లేదా మ్యూజియం అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.