ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా రైతులకు శుభవార్త చెబుతూ, ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మూడవ విడత పెట్టుబడి సాయాన్ని రేపు (మార్చి 13, శుక్రవారం) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షేమం మరియు అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత కోసం త్వరలోనే ఒక ప్రత్యేక ‘సంక్షేమ క్యాలెండర్’ విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపిన సీఎం, ఉగాది పండుగ నాటికి 2.50 లక్షల గృహాలను సిద్ధం చేసి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రత్యేక సంక్షేమ కార్డులను అందజేయాలని, దీనివల్ల పథకాల అమలులో యాజమాన్య బాధ్యత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌తో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని, ఇందుకు గాను రూ.1,775 కోట్లను ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని సీఎం వివరించారు. దీపం 2.0 పథకంలో డిజిటల్ ఓచర్ల వినియోగాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. రహదారుల మరమ్మతులకు రూ.1,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ‘పల్లె పండుగ’ కింద రూ.4,000 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేస్తూ, సంపద సృష్టి ద్వారా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.