‘సత్యం తోడుగా ఉన్నంత వరకు’.. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఘాటు స్పందన

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడంపై కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ కేసులో చార్జీలు ఫ్రేమ్ చేయడానికి కూడా తగిన ఆధారాలు లేవని గతంలో రౌస్ అవెన్యూ కోర్టు కేసును కొట్టేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సత్యం తన వెంట ఉన్నంత వరకు దేనికీ భయపడేది లేదని, విచారణాధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సీబీఐ అధికారులు ఈ నెల 16వ తేదీన తనను విచారణకు రావాలని కోరారని, ప్రస్తుతం ఈ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు కవిత వెల్లడించారు. గతంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఆ విచారణ కూడా 16వ తేదీనే ఉందని ఆమె పేర్కొన్నారు. కోర్టు తీర్పులను, న్యాయవ్యవస్థను గౌరవిస్తూనే చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆమె తన ట్వీట్‌లో ధీమా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కవిత 2024 మార్చిలో అరెస్ట్ అయ్యి, సుమారు ఆరు నెలల పాటు తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు మళ్ళీ సీబీఐ నోటీసులు ఇవ్వడం, అదే సమయంలో ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *