దేశంలోనే తొలి అటానమస్ షిప్ యార్డ్: జువ్వలదిన్నెలో శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రక్షణ మరియు పారిశ్రామిక రంగాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద దేశంలోనే మొట్టమొదటి ‘అటానమస్ మారిటైం షిప్ యార్డ్’కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం శంకుస్థాపన చేశారు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ఈ కేంద్రం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ను మారిటైం రోబోటిక్స్ మరియు అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు కోసం కూటమి ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో సుమారు 29.58 ఎకరాల భూమిని కేటాయించింది. తొలి దశలో సాగర్ డిఫెన్స్ సంస్థ రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా షిప్ బిల్డింగ్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన వంటి రంగాల్లో స్థానిక యువతకు వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును మొత్తం 200 ఎకరాలకు విస్తరించి, భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

వచ్చే ఏడాది నవంబర్ (2026) నాటికి ఈ కేంద్రంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సాగర్ డిఫెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. సముద్ర సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంలో ఈ షిప్ యార్డ్ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని, బ్లూ ఎకానమీ బలోపేతానికి ఇది ఎంతో దోహదపడుతుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *