ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: అయోధ్యలో నిలిచిన అన్నదానం.. వంట గ్యాస్ కొరతే కారణం

పశ్చిమాసియాలో చెలరేగిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు భారత్‌లో వంట గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ఈ ప్రభావం చివరకు ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యపై కూడా పడింది. ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత కారణంగా అయోధ్యలోని ప్రసిద్ధ అమవా రామ్ మందిరంలో నిర్వహించే ‘రామ్ రసోయి’ అన్నదాన కేంద్రాన్ని నిర్వాహకులు తాత్కాలికంగా మూసివేశారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో భక్తులకు భోజన వసతి కల్పించలేకపోతున్నామని ఆలయ అధికారులు నోటీసులు ప్రకటించారు.

యుద్ధం కారణంగా ముడి చమురు మరియు గ్యాస్ దిగుమతులకు ఆటంకం కలగడంతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. మంగళవారం మధ్యాహ్నం నుంచే రామ్ రసోయిలో వంట గ్యాస్ సమస్య మొదలైందని, దీంతో వందలాది మంది భక్తులు భోజనం దొరకక ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. కేవలం అయోధ్యలోనే కాకుండా ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌తో పాటు బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని అనేక హోటళ్లు కూడా ఇదే కారణంతో మూతపడుతున్నాయి.

ప్రస్తుతానికి గ్యాస్ నిల్వలు అందుబాటులో లేనందున కమ్యూనిటీ కిచెన్ సేవలను నిలిపివేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. రామ్ లల్లా దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఈ అన్నదాన కేంద్రం మూతపడటం పెద్ద లోటుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *