“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు”: మృత్యువుతో పోరాడి 169 మంది భారతీయులను రక్షించిన యువ పైలెట్

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రాణాలకు తెగించి 169 మంది భారతీయులను కాపాడిన 23 ఏళ్ల పైలెట్ దీపికా అధానా సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గగనతలం ప్రమాదకరంగా మారిన స్థితిలో, యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో చిక్కుకున్న మనవారిని స్వదేశానికి చేర్చే బాధ్యతను ఆమె భుజానికెత్తుకున్నారు. ఈ మిషన్‌కు వెళ్లే ముందు “అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు, బై బై” అంటూ ఆమె తన తల్లికి పంపిన సందేశం అందరినీ కలచివేస్తోంది.

మార్చి 6న అనూహ్యంగా ఈ రెస్క్యూ మిషన్ పిలుపు రాగా, దీపికా ఏమాత్రం వెనుకాడకుండా యుద్ధ క్షేత్రానికి విమానాన్ని నడిపారు. కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సిబ్బందితో కూడిన ఈ బృందం ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో కమ్యూనికేషన్ తెగిపోయి భయాందోళనలు నెలకొన్నప్పటికీ, ధైర్యంగా విమానాన్ని నడిపి అందరినీ సురక్షితంగా ఇండియాకు చేర్చారు.

ఫరీదాబాద్‌కు చెందిన దీపికా, తన తాతయ్య కలని నిజం చేస్తూ పైలెట్‌గా ఎదిగారు. కోవిడ్ సమయంలో ఎన్నో ఇబ్బందులను అధిగమించి కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించి, ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంత చిన్న వయసులో మృత్యువును ఎదిరించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన దీపికాను చూసి ఆమె తల్లి బాబ్లీ అధానా మరియు కుటుంబ సభ్యులు గర్వంగా ఆనందభాష్పాలు రాల్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *