ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు: జగన్ సన్నిహితులకు నోటీసులు.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ. 4,000 కోట్ల మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న అధికారులు, మాజీ సీఎం జగన్ సన్నిహితులైన ధనుంజయ్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. గత పదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆస్తుల పత్రాలతో హాజరుకావాలని ఆదేశించడంతో నిందితులు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ కుంభకోణం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 1,048 కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.

దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే భారీ చర్యలకు ఉపక్రమించింది. మార్చి 6న ప్రధాన నిందితులైన రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, ఐఆర్ఎస్ అధికారి వాసుదేవరెడ్డికి చెందిన రూ. 441.63 కోట్ల విలువైన చరాస్తులు, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. జైలులో ఉన్న ఏ1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఇతర అధికారులకు, రాజకీయ అనుచరులకు నోటీసులు వెళ్తున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు, మద్యం కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడంలో జరిగిన అవకతవకలపై లోతైన వివరాలు రాబట్టారు.

ఈ కుంభకోణం వెనుక పక్కా పథకం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. 2019 తర్వాత ఆన్‌లైన్ మద్యం విక్రయాలను నిలిపివేసి, కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్లు సిట్ (SIT), ఈడీ గుర్తించాయి. డిస్టిలరీల నుంచి 15-20 శాతం కమిషన్లు వసూలు చేసి, ఆ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయగా, తాజా విచారణల అనంతరం మరికొంతమంది కీలక వ్యక్తులపై ఈడీ కొరడా ఝులిపించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *