పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు క్షేత్రాలు, రిఫైనరీలపై ఇజ్రాయెల్ ఆదివారం తెల్లవారుజామున అత్యంత భీకరమైన వైమానిక దాడులకు పాల్పడింది. టెహ్రాన్‌లోని మూడు ప్రధాన ఆయిల్ డిపోలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించడంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల తీవ్రత ఎంతలా ఉందంటే, ఇంధనం లీక్ అయ్యి వీధుల్లో ‘అగ్ని నది’ ప్రవహించిందని, దట్టమైన పొగ కారణంగా ‘ఆమ్ల వర్షం’ కురిసే ప్రమాదం ఉందని స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.
ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల గురించి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తారని అగ్రరాజ్యం ఊహించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు ఇజ్రాయెల్ వైఖరిని తప్పుబడుతూ ‘WTF’ (తీవ్ర అసహనం) అంటూ మెసేజ్ పంపడం దౌత్య వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన తర్వాత అమెరికా ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. చమురు వనరులను నాశనం చేయడం వల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు.
ముడి చమురు ధరలు గత పది రోజుల్లోనే 17 శాతం పెరిగి, బ్యారెల్ 100 డాలర్లు దాటడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. ఇరాన్ పౌరులకు ఇబ్బంది కలిగించేలా చమురు కేంద్రాలను టార్గెట్ చేయడం వ్యూహాత్మకంగా ‘సరైన ఆలోచన కాదు’ అని అమెరికా అభిప్రాయపడుతోంది. దీనివల్ల ఇరాన్ ప్రజల్లో అమెరికా, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరగడమే కాకుండా, పెరిగిన ధరల వల్ల వచ్చే విమర్శలను తాము కూడా మోయాల్సి వస్తుందని వైట్‌హౌస్ భావిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.