మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి ఏప్రిల్ 11న రాష్ట్రస్థాయి జాబ్ మేళా – స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం ఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ప్రకటన.

తేది:08-03-2026 TSLAWNEWS కరీంనగర్ జిల్లా, హుజురాబాద్, రిపోర్టర్ ఎం ప్రవీణ్.

కరీంనగర్ జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
మహిళలు శక్తివంతులైతేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు. ఒక మహిళకు విద్య అందించడం అంటే ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్నే అభివృద్ధి వైపు తీసుకెళ్లడమేనని ఆయన వివరించారు.
ప్రస్తుతం మహిళలు రాజకీయాలు, విద్య, వైద్యం, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల ఇంకా వివక్ష కొనసాగుతుండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న మహిళలకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వం పెంపొందుతుందని, మహిళలకు సమాన హక్కులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దిలీప్ కుమార్ అభిప్రాయపడ్డారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ 11న జిల్లా స్థాయి జాబ్ మేళా మరియు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు దిలీప్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మహిళలతో పాటు నిరుద్యోగ యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎల్‌డీ అధికార ప్రతినిధి గౌర వీరప్ప, జనరల్ సెక్రటరీ నరసింహారావు,కరీంనగర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బియ్యాల కృష్ణ, ఆసంపల్లి అజయ్,
జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవసాని ప్రియదర్శిని, అనూష, కల్పన, స్వర్ణలత మహిళా సంఘాల నాయకులు మరియు పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *