తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 8వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం జరగనుంది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టుల వారీగా ఉన్న సాంకేతిక, క్షేత్రస్థాయి అడ్డంకులను, జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సాగునీటి పథకాలపై ఈ సమీక్షలో సమగ్రంగా చర్చించనున్నారు.
ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. వీటితో పాటు రాజీవ్ భీమా, జవహర్‌లాల్ నెహ్రూ ఎత్తిపోతల పథకాలు, కోయిల్ సాగర్, ప్రియదర్శిని జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకోనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది.సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూసేకరణ (L.A.), పునరావాస (R&R) సమస్యలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ ప్రతినిధులు.. అధికారుల సమన్వయంతో సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ నోట్ రూపొందించారు.
ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఐకాడ్ (I&CAD) కార్యదర్శి ఈ. శ్రీధర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC)లు, వివిధ విభాగాల చీఫ్ ఇంజనీర్లు, ప్రాజెక్టు పనులు చేపడుతున్న ఏజెన్సీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే దిశగా ఈ సమావేశం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి వారం ఇటువంటి సమీక్షలు నిర్వహించాలని మంత్రి యోచిస్తున్నారు