ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక.. హైదరాబాద్‌లో అమలుపై కీలక నిర్ణయం..!

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సమష్టి కృషితో విజయవంతం చేయాలని హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మైనార్టీ మంత్రి మొహ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా చేపట్టాల్సిన అంశాలపై మంత్రి అధికారులకు వివరించారు. హైదరాబాద్ జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ క్లియరెన్స్, ఆరోగ్యం, పిల్ల భద్రత, సంక్షేమం, నో డ్రగ్స్ , విద్య, యువత, క్రీడలు, మహిళలు పర్యావరణం అనే పది ప్రధానాంశాలున్నాయని చెప్పారు. వాటన్నింటిని 99 రోజుల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు.

 

ఒక్కో ప్రధానాంశంకు సంబంధించి ఆ శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని మంత్రి వెల్లడించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం మార్చి 26 నుండి మార్చి 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యం కు సంబంధించి ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ పోలీసు విభాగంలో ‘సురక్షితంగా చేరుకోండి’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు చేపట్టడం జరుగుతుందని, సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

 

అలా ప్రతీ శాఖలోనూ నిర్దేశిత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి పొన్నం సూచించారు. అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో జిల్లా మంత్రుల సన్నాహక సభలు జరుగుతాయని, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, సొసైటీ చైర్మన్లను కూడా ఆహ్వానించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పోలీస్ కమిషనర్ సజ్జనార్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *