ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ కీలక పరిణామాలు..!

ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాజీనామా చేశారు. గవర్నర్ రాజీనామా చేసినట్లు వెస్ట్ బెంగాల్ లోక్‌భవన్‌ వెల్లడించింది. ఆనంద బోస్‌ తన రాజీనామాకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. గురువారం ఉదయమే ఆనంద బోస్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఆనంద బోస్ నవంబర్‌ 17, 2022న బాధ్యతలు చేపట్టారు. దాదాపు మూడున్నరేళ్లు పాటు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. నూతన గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి రానున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం అందిందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

 

కొత్త గవర్నర్ గా ఆర్ఎన్ రవి

సీఎ మమతా బెనర్జీతో విభేదాలతో వార్తల్లో నిలిచిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా చేశారు. బోస్ స్థానంలో ప్రస్తుతం తమిళనాడుకు గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్ రవి పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా నియమితులవుతారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నియామకానికి ముందు కేంద్రం తనను సంప్రదించలేదని, కేంద్రం తీసుకున్న నిర్ణయం ” ఏకపక్ష నిర్ణయమని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాష్ట్రాల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆమె అన్నారు.

 

అయితే ఆనంద బోస్ రాజీనామా పునర్వ్యవస్థీకరణలో భాగమని, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కూడా రాజీనామా చేశారని కేంద్ర వర్గాలు అంటున్నారు. అనేక రాష్ట్రాలలో గవర్నర్లను మార్చమచ్చని, కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితాను రాష్ట్రపతి భవన్ త్వరలో విడుదల చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

 

కేంద్ర హోంమంత్రి ఒత్తిడి!

గవర్నర్ రాజీనామా తనను షాక్ కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడానికి గవర్నర్ పై కేంద్ర హోంమంత్రి నుంచి కొంత ఒత్తిడి ఉందని తెలిసి తాను ఆశ్చర్యపోనని మమతా బెనర్జీ ఎక్స్ పోస్టు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *