లంచం తీసుకుంటూ ఆఫీసర్ ఏసీబీకి చిక్కిన GHMC ఆఫీసర్..!

సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ (GHMC) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు జరిపారు. ఈ దాడిలో అకౌంట్స్ ఆఫీసర్ (AO) సూర్యవంశీ సంతోష్ కుమార్ రూ. 35వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన ప్రయోజనాల కోసం లంచం డిమాండ్ చేయడమే ఈ ఘటనకు దారితీసింది.

 

బాధితుడు గత ఏడాది అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీలో మజ్దూర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైల్‌ను ముందుకు కదిలించాలని కోరుతూ ఆయన గత కొద్ది కాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, అకౌంట్స్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆ ఫైల్‌ను పై అధికారులకు పంపాలంటే రూ. 40వేలు లంచం ఇవ్వాలని బాధితుడిని వేధించారు. చివరకు రూ. 35వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

 

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో అధికారులు పక్కా వ్యూహంతో ‘ట్రాప్’ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో సికింద్రాబాద్ కార్యాలయంలో బాధితుడి నుండి సంతోష్ కుమార్ నగదు తీసుకుంటుండగా.. అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. నిందితుడి చేతులకు జరిపిన కెమికల్ పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా రావడంతో, లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

 

ఏసీబీ అధికారులు సంతోష్ కుమార్‌ను అరెస్ట్ చేసి, ఆయన ఇంటి వద్ద కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ అవినీతిలో మరికొంత మంది అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని సంప్రదించాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *