వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎలా వచ్చిందో వైసీపీతో చేతులు కలిపిన మాజీ ఛైర్మన్ ను అడగాలని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. బందరు బియ్యం దొంగ నీతులు, చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
మార్ఫింగ్ వైసీపీ పేటెంట్
“వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్ఫింగ్ చేయటం వైసీపీ పేటెంట్ హక్కులు. 33 రోజులు నన్ను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారు. అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వ హయంలోనే భయపడలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పేపర్, ఛానల్‌కి రూ.307 కోట్ల అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయంలో ఓ సిమెంట్స్ కంపెనీ నుంచి కాంట్రాక్టర్లతో 3 లక్షల టన్నులకు పైగా సిమెంట్‌ను కొనిపించారు”- ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
వైసీపీ ప్రభుత్వంలో తనపై 22 కేసులు పెట్టారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తనకు సహకరిస్తే ఆ తప్పుడు కేసులు ఎత్తేయాలి కదా? అని ప్రశ్నించారు. వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎందుకు వచ్చిందో? వైసీపీతో చేతులు కలిపి తనపై మీద కుట్ర చేసి కేసులు పెట్టించిన మాజీ ఛైర్మన్‌ను అడగాలన్నారు. తాను బాధ్యత చేపట్టాక వైష్ణవి డెయిరీని నిలిపివేశానన్నారు.
పాలు, వెన్న లేకుండా నెయ్యి
తిరుపతి లడ్డు కల్తీ అయిందనేది నిజం, వెజిటబుల్, జంతువుల కొవ్వు ఉందని NDDB చెప్పిందని ధూళిపాళ్ల తెలిపారు. వైసీపీ వాళ్లు ఇప్పటికైనా స్వామి దగ్గరకు వెళ్లి తప్పు ఒప్పుకోవాలన్నారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకి రూ.12.5 కోట్లు, చెన్నైకి రూ.7.5 కోట్లు వచ్చాయని సిట్ చెప్పిందన్నారు. బహిరంగ మార్కెట్ లో బటర్ ధర రూ.360 ఉంటే రూ.316 లకు నెయ్యి ఎలా సరఫరా చేశారని ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన మహా ఘనులు వైసీపీ నాయకులన్నారు. సంగం డెయిరీ 2020, 2021లో కూడా టీటీడీ నెయ్యి టెండర్ వేసిందని గుర్తుచేశారు.
సంగం రైతులది
తిరుమల శ్రీవారికి సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి సంగం డెయిరీ ఎదురుచూసిందన్నారు. స్వామి ఇప్పుడు అవకాశం ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు చెపితే టెండర్ ఇవ్వలేదని, నిబంధనలు, సాంకేతిక శాస్త్రీయ పరీక్షలు అనంతరం టెండర్‌లో పాల్గొని సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తుందన్నారు. హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదన్నారు. సంగం డెయిరీ గుంటూరు రైతులది, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని గుర్తుచేశారు. వైసీపీ చేసిన పాపాన్ని మోసి సమర్ధించే పాపం బొత్స సత్యనారాయణ ఆసుపత్రిలో ఉన్నారన్నారు.
తప్పు చేస్తే అంతే
“కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేస్తే మట్టిలో కలిసిపోవడం ఖాయం. పవిత్రమైన తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన వైసీపీ ఆ తప్పు నుండి బయట పడేందుకు ఇతరుల మీద బురద జల్లుతుంది. వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా.. అమూల్ తరువాత దక్షిణ భారతదేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీ”- ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్