ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఈ జిల్లానే టాప్..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,68,540 ఇళ్లను కేటాయించగా, 3,24,733 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా ఈ ఇండ్ల పనుల పురోగతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా టాప్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జనగామ, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా 95.63 శాతం మేర పనుల్లో పురోగతి సాధించగా జనగామ 91.20 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లా 90.38 శాతం మేర పనుల్లో పురోగతి సాధించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.22,500 కోట్ల బడ్జెట్‌ను అంచనా వ్యయంగా కేటాయించింది. కాగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పనులు కలుపుకుని దాదాపు రూ.4929.48 కోట్లు ఖర్చు చేసింది. కాగా ఖమ్మం జిల్లాలో రూ.387.74 కోట్లను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేటాయించారు. జనగామ జిల్లాకు రూ.123.34 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ.201.77 కోట్లు ఖర్చు చేశారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా 3,68,540 ఇండ్లు

తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. విడుతల వారీగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని డిసైడ్ అయింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3,68,540 ఇండ్లను సర్కార్ అలొకేట్ చేసింది. వాటిలో 3,24,733 ఇండ్లను శాంక్షన్ చేసింది. మొత్తం మంజూరైన ఇండ్లలో 2,61,160 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఇండ్లలో 65,479 బేస్‌మెంట్‌ స్థాయి వరకు పనులు పూర్తయ్యాయి. వాలింగ్ దశలో 36,051 ఇండ్లు, స్లాబ్ దశలో 1,06,624 ఇండ్లు ఉన్నాయి. కాగా 8,424 ఇండ్లు ఫినిషింగ్ దశలో ఉన్నాయి. మొత్తం గ్రౌండింగ్ అయిన ఇండ్లలో 82.93 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఖమ్మం జిల్లా అత్యధికం

ఖమ్మం జిల్లా అత్యధికంగా 95.63 శాతం పురోగతి నమోదైంది. ఇక్కడ 16,349 ఇండ్లు మంజూరు కాగా 14,473 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. అలాగే జనగామ జిల్లాలో 91.20 శాతం పనులు పురోగతి సాధించింది. యాదాద్రి భువనగిరి 90.38 శాతం పురోగతితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా 66.37 శాతంతో అట్టడుగు స్థానంలో ఉంది. కాగా తెలంగాణలో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 18,910 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. వాటిలో 15,864 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఇండ్లు శాంక్షన్ అయిన జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం(17,938), నిజామాబాద్(17,412) నిలిచాయి. ఇదిలా ఉండగా ఈ పథకం ద్వారా నిధులు దళారుల చేతికి వెళ్లకుండా ఉండేలా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఇంటి నిర్మాణ దశలైన బేస్‌మెంట్, గోడలు, స్లాబ్, ఫినిషింగ్ ఆధారంగా నాలుగు విడుతలుగా నిధులు విడుదల చేస్తారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *