రైల్వేశాఖ ఆంధ్రప్రదేశ్‌కు తీపి కబురు చెప్పింది. కొత్తగా నాలుగు మెగా టెర్మినల్స్ నిర్మించాలని భావిస్తోంది. ఇంతకీ కొత్త టెర్మినల్స్ ఏయే ప్రాంతాల్లో వస్తున్నాయి? మరి భూముల మాటేంటి? టెర్మినల్స్ నిర్వహణ బాధ్యత ఎవరిది? ఈ విషయంలో రైల్వేశాఖ ఆలోచన ఏంటి? ఏ విధంగా అడుగులు వేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేశాఖ చల్లటి కబురు
ఏపీకి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది.. రాష్ట్రంలో నాలుగుచోట్ల కొత్తగా రైల్వే మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఈ టెర్మినల్స్‌ను నిర్మించడంతో పాటుగా నిర్వహణ బాధ్యతను రైల్వేశాఖ తీసుకుంటుంది.. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున టెర్మినల్స్ కోసం భూమిని మాత్రం కేటాయించాల్సి ఉంటుంది.
విశాఖపట్నం, అమరావతి, గన్నవరం, తిరుపతి మెగా టెర్మినల్స్ ప్లాన్ చేశారు.. ఈ మేరకు భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ నాలుగు టెర్మినల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపుల కోసం కసరత్తు జరుగుతోంది. రైలు బయల్దేరే స్టేషన్, చేరుకునే స్టేషన్ ఒకటే అయితే అక్కడ ఈ మెగా టెర్మినల్స్ నిర్మిస్తారు. అక్కడ రైళ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేస్తుంటారు.
కొత్తగా నాలుగు మెగా టెర్మినల్స్.. కాకపోతే
విశాఖపట్నం సిటీల రైల్వే మెగా టెర్మినల్ ఆలోచన చేస్తోంది రైల్వేశాఖ. విశాఖలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించాలని ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద టెర్మినల్ నిర్మించాలని ప్లాన్ చేసింది. ఎందుకంటే విశాఖ సిటీలో అవసరమైన స్థలం లేకపోవడంతో జగన్నాథపురం వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
ఇందుకోసం దాదాపు 500 ఎకరాలు కావాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొత్తవలస నుంచి అనకాపల్లికి కొత్తగా బైపాస్ డబుల్ లైన్ ప్రతిపాదన ఉంది. గూడ్సు రైళ్లు సింహాచలం, దువ్వాడ మీదుగా విజయవాడ వైపు వెళుతున్నాయి. రానున్న రోజుల్లో కొత్తవలస మీదుగా అనకాపల్లి వెళ్లేందుకు డబుల్ లైన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
విశాఖ తర్వాత గన్నవరం వద్ద మెగా టెర్మినల్ నిర్మించాలని భావిస్తోంది రైల్వేశాఖ. దీనికి 145 ఎకరాలు భూమి అవసరమని తెలుస్తోంది. దీనివల్ల విజయవాడపై కొంత ఒత్తిడి తగ్గనుంది. మరి గన్నవరం రైల్వేశాఖ కోరుతున్నట్లుగా అంత భూమి ఉందా? ఇదికాకుండా అమరావతికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఎర్రుపాలెం-నంబూరు లైన్ అన్నమాట. ఈ లైన్లో మెగా టెర్మినల్‌కు 300 ఎకరాలు కావాలని కోరింది.
ఇదికాకుండా టెంపుల్ సిటీ తిరుపతి సమీపంలో మరో టెర్మినల్ నిర్మించాలని ఆలోచన చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం అక్కడికి రైళ్లు వస్తున్నాయి. దీంతో తిరుపతి స్టేషన్‌పై ఒత్తిడి పెరిగింది. రద్దీ నేపథ్యంలో తిరుపతి-రేణిగుంట మధ్య టెర్మినల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం భూమిని గుర్తించే పనిలో పడ్డారు ఏపీ అధికారులు. మొత్తానికి నాలుగు టెర్మినల్స్ పూర్తయితే ఏపీ రూపురేఖలు మారిపోవడం ఖాయం.