అనకాపల్లిలో 100 కోట్ల భూ దోపిడీ.. ‘కూటమి’ గుట్టు రట్టు చేసిన అమర్నాథ్..!

అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న 100 కోట్ల దేవాదాయ భూమి స్కామ్‌పై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివాదాస్పద స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, ఈ భూ భాగోతం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న విశాఖ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన ఎకరా 11 సెంట్ల భూమిని కాజేసేందుకు కుట్ర జరుగుతోందని అమర్నాథ్ పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం దీని ధర కోట్లలో ఉంటుందని ఆయన అంచనా వేశారు.

 

గతంలో ఎండోమెంట్ భూమిగా రికార్డుల్లో ఉన్న ఈ స్థలాన్ని, కూటమి నాయకుల ఒత్తిడితో అధికారులు జిరాయితీ భూమిగా మార్చేందుకు ఫైళ్లు కదిపారని ఆయన ఆరోపించారు. కౌలుదారులకు భూమిని అమ్మే లేదా దానం చేసే హక్కు లేదని గుర్తు చేస్తూ అధికారుల తీరును తప్పుబట్టారు.

 

సనాతన ధర్మంపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ఈ భూ కుంభకోణంపై సిబిఐ (CBI) ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగల ముఠా మాదిరిగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని విమర్శించారు.

 

అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘మేం చేసిన ఆరోపణలు తప్పయితే కూటమి నాయకులు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి’ అని సవాల్ విసిరారు.

 

చివరిగా.. ‘కర్మ ఎవరిని వదిలిపెట్టదు’ అని వ్యాఖ్యానిస్తూ, గతంలో తిరుపతి లడ్డూ అంశంపై రాజకీయం చేయాలని చూసిన వారికి ఇప్పుడు అదే శాపంగా మారుతోందని ఎద్దేవా చేశారు. దేవుడి భూములను కాజేయాలని చూస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *