ట్రాఫిక్ సమస్యకు చెక్.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం..

గ్రేటర్ హైదరాబాద్ లో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇప్పటికే హెచ్ సిటీ పనులను పట్టాలెక్కించిన జీహెచ్ఎంసీ.. మరో ప్రయత్నం చేసేందుకు సిద్దమైంది. గత బీఆర్ఎస్ పాలనలో రోడ్ల మెరుగైన నిర్వహణ కోసం అమలు చేసిన కాంప్రాహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో దశను అమలు చేసేందుకు సిద్దమైంది. ముఖ్యంగా రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి వాటిని జవాబుదారిని చేయటంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు వంటివి పారదర్శకంగా చేసేలా సీఆర్ఎంపీ-2 ను అమలు చేయనుంది.

 

ఇప్పటి వరకు ప్రతిపాదనల స్థాయిలో ఉన్న ఈ అంశానికి గతంలోనే స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదించగా తాజాగా సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ సమావేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం రూ. 3145 కోట్ల వ్యయంతో సిటీలోని సుమారు 1045.01 కిలోమీటర్ల పొడువున రోడ్లకు మెరుగైన మెయింటనెన్స్ బాధ్యతలను చేపట్టనున్నారు. వీటిలో ఈ మెయింటనెన్స్ పనులను మూడు రకాలుగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. వీటిలో ఫస్ట్ సుమారు 744.22 కిలోమీటర్ల బీటీ, సీటీ రోడ్లను.. రూ. 2230 కోట్లతో మెయింటనెన్స్ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు.

 

అలాగే అదనంగా సుమారు 64.49 కిలోమీటర్ల సీసీ రోడ్లను రూ. 208 కోట్ల వ్యయంతో మెరుగైన నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో పాటు మరో 236.30 కిలోమీటర్ల పొడువున్న బీటీ రోడ్ల నిర్వహణ బాధ్యతలను సుమారు రూ. 707.07 కోట్లతో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు తెలిసింది. గతంలో అమలు చేసిన సీఆర్ఎంపీ-1 లో సుమారు 744.22 కిలోమీటర్ల రోడ్లకు మెరుగైన నిర్వహణ బాధ్యతలను అప్పగించగా మరో 300.79 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లను కూడా మెరుగైన మెయింటనెన్స్ కోసం ఏజెన్సీలకు అప్పగించారు.

 

కాంప్రాహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో దశ కింద సుమారు రూ. 3145 కోట్ల వ్యయంతో సిటీలోని సుమారు 1045.01 కిలోమీటర్ల పొడువున రోడ్లకు మెరుగైన మెయింటనెన్స్ బాధ్యతలను చేపట్టనున్న నిర్వహణ ఏజెన్సీలు పదేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. గత గులాబీ పాలనలో కూడా సీఆర్ఎంపీ-1 ను అమలు చేసినప్పటికీ, అందులో కొన్ని సంస్థలు నిర్వహణ బాధ్యతలను సక్రమంగా, పారదర్శకంగా చేపట్టడంలో విఫలయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తటంతో అధికారులు ఈ సారి నిర్వహణ నిబంధనలను కొంత కఠినతరం చేయనున్నట్లు తెలిసింది. స్ట్రెచ్ ల వారీగా ఏజెన్సీలకు బీటీ, సీసీ రోడ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ ఏజెన్సీలు ప్రతి రోడ్డుకు ఖచ్చితంగా పేమెంట్లను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *