మహిళల భద్రత అనేది ఒక్క శాఖ బాధ్యత కాదు.. అది ప్రభుత్వ సమగ్ర కర్తవ్యం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిర్లక్ష్యానికి చోటులేకుండా, బాధ్యతతో, సాంకేతికతతో, సమన్వయంతో పనిచేస్తేనే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని వెల్లడించారు. మహిళా సాధికారతకు అవసరమైన పలు కీలక పథకాలను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సచివాలయంలో మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం అవలంబించాల్సిన నూతన విధానాలపై సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా భద్రతను బలోపేతం లక్ష్యంతో పలు అంశాలపై చర్చించారు.
షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, రాత్రి వేళల ప్రయాణాలు, డిజిటల్ వేదికలు, అసంఘటిత రంగం వంటి విభిన్న రంగాల్లో ఇంకా వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని సమావేశం అభిప్రాయపడింది. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల రక్షణ కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో,కంపెనీల్లో ఐసీసీ కమిటీలకు తప్పనిసరి ఆడిట్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలని సూచించారు.
ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలి
అసంఘటిత రంగ మహిళల కోసం ప్రత్యేక నమోదు, గుర్తింపు కార్డు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రజా రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేసి పీక్ అవర్స్‌లో భద్రతా ఆడిట్లు నిర్వహించాలని నిర్ణయించారు. సైబర్ మార్ఫింగ్, స్టాకింగ్, బ్లాక్‌మెయిల్ వంటి నేరాలపై వేగంగా స్పందించడంతో పాటు బాధితులకు కౌన్సెలింగ్ కల్పించాలన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగ మహిళల రక్షణకు ప్రత్యేక విధానాలు రూపొందించాలన్నారు. గృహ హింస కారణంగా ఒంటరిగా మిగిలిన మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆశ్రయ గృహాలు, హాస్టళ్ల భద్రతపై డిజిటల్ పర్యవేక్షణ ప్రోటోకాల్ అమలు చేయాలని ఆదేశించారు. మహిళల భద్రతకు సంబంధించి హెం, మహిళా శిశు సంక్షేమ, విద్య, కార్మిక, రవాణా, మున్సిపల్ పరిపాలన, ఐటి, ఆరోగ్య శాఖల సమన్వయంతో రాష్ట్ర స్థాయి మహిళా భద్రత కన్వర్జెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.
వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్దం చేయాలి
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్దం చేయాలని, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ చట్టపరమైన రక్షణతో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లైంగిక వేధింపుల కేసుల పురోగతిపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల కోసం ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో చేరిక ప్రక్రియను ప్రభుత్వ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను వచ్చే ఆర్దిక సంవత్సరంలో కూడా పంపిణి చేస్తామని ప్రకటించారు. సమావేశంలో అధికారులు సంజయ్ కుమార్, శికా గోయల్, క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, ప్రియాంకా వర్గీస్, శృతి ఓజా, దివ్యా దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.