ఐటీ కారిడార్ ఆనుకుని భారీ ఆపరేషన్.. రూ. 600 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం..

హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న గంధంగూడలో సుమారు రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పి లోని 6.30 ఎకరాల స్థలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం జలమండలికి కేటాయించబడింది. అత్యంత విలువైన ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వివిధ పేర్లతో ఆక్రమణలకు పాల్పడుతూ అక్కడ షెడ్లు నిర్మించి కబ్జా చేశారు.

 

ఈ భూమిపై తమకు హక్కు ఉందని జలమండలి నుండి అందిన విజ్ఞప్తి మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపిన అనంతరం ఆ భూమి ప్రభుత్వం కేటాయించినదిగా నిర్ధారించారు. ముఖ్యంగా నగర అవసరాల కోసం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) నిర్మాణానికి ఈ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమణదారులు వేసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది వెంటనే తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

కేవలం ఆక్రమణలను తొలగించడమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు గురికాకుండా ఉండటానికి హైడ్రా పకడ్బందీ చర్యలు చేపట్టింది. జలమండలికి కేటాయించిన మొత్తం 6.30 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించి రక్షణ కల్పించింది. ఈ స్థలం ప్రభుత్వానిదని.. ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ హైడ్రా అధికారిక బోర్డులను ఏర్పాటు చేసింది. ఐటీ కారిడార్ వంటి అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఇంత భారీ విలువైన భూమిని కాపాడటంపై సామాన్య ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా రాజీలేని పోరాటం చేస్తోందని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *