మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అరెస్ట్.

తేది:28-2-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: BRS మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ శ్రేణులతో ఘర్షణ చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఒక ఎమ్మెల్యే సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
శనివారం తెల్లవారుజామున భారీ పోలీసు బలగాలు ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి. ఇదే కేసులో ఇప్పటికే పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
బిఆర్ఎస్ నేతలు ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆరోపించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
ఇదిలాఉండగా, పోలీసులు మాత్రం చట్టపరమైన ఆధారాల మేరకే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ ఘటనతో మెదక్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *