కోర్టులోనే జడ్జికి బెదిరింపులు: శిక్ష విధించారని రెచ్చిపోయిన హంతకులు

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్ జిల్లా కోర్టులో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఒక హత్య కేసులో తమకు యావజ్జీవిత కారాగార శిక్ష విధించిన న్యాయమూర్తిని ఇద్దరు దోషులు కోర్టు హాలులోనే బహిరంగంగా బెదిరించారు. “నిన్ను చంపుతాం.. నీ ఇల్లు ఎక్కడో మాకు తెలుసు” అంటూ వారు రెచ్చిపోవడంతో న్యాయస్థానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు న్యాయమూర్తికి భారీ భద్రత కల్పించి ఆయన నివాసానికి తరలించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. బిజ్‌నోర్ జిల్లాకు చెందిన పుఖరాజ్ సింగ్ (55) అనే వ్యక్తిని మే 2024లో జయదీప్ సింగ్ (35), పింటూ చౌహాన్ (30) అనే వ్యక్తులు కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. పుఖరాజ్ కుమార్తె తన అత్తింటి వారిపై (జయదీప్ సోదరుడి కుటుంబంపై) వరకట్న వేధింపుల కేసు పెట్టినందుకు కక్షగట్టిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన అడిషనల్ అండ్ సెషన్స్ జడ్జి, నిందితులు ఇద్దరినీ దోషులుగా నిర్ధారిస్తూ గురువారం యావజ్జీవిత శిక్షను ఖరారు చేశారు.

తీర్పు వెలువడిన వెంటనే నిందితులు ఇద్దరు న్యాయమూర్తితో పాటు, బాధితురాలిని (పుఖరాజ్ కుమార్తె) కూడా వదిలిపెట్టబోమని శపథం చేశారు. దీంతో వారిపై అదనంగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం న్యాయమూర్తి నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. న్యాయ వ్యవస్థపైనే నేరుగా దాడికి దిగేలా నిందితులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *