కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సంభవించిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆయన స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకుని, పేలుడు ధాటికి ఛిద్రమైన ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ పరిశ్రమను పరిశీలించారు. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను చూసి చలించిపోయిన సీఎం, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
ప్రమాద తీవ్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, పేలుడుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా లోపాలు, అజాగ్రత్తల వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, లైసెన్సు నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరుపుతున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాణసంచా తయారీ కేంద్రాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సామర్లకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతదేహాలు సమీపంలోని పొలాల్లో ఎగిరిపడటం వంటి హృదయవిదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తుండటంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.