తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ (TTD) పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెరుగుతున్న భక్తల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మరో అన్నప్రసాద భవనం, అత్యాధునిక వంటశాలను నిర్మించనున్నారు. దీని కోసం రిలయన్స్ సంస్థ రూ.100 నుంచి రూ.120 కోట్ల భారీ విరాళం అందించేందుకు ముందుకు రాగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భక్తులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల సౌకర్యార్థం ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే వినూత్న పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం భక్తులు హుండీలో నగదు, నాణేలు వేస్తుంటారు. అయితే నగదు అందుబాటులో లేని వారు లేదా డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే వారి కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ UPI ద్వారా చెల్లింపులు చేస్తే టీటీడీ సిబ్బంది ‘ముడుపు పత్రాలు’ అందజేస్తారు, వీటిని భక్తులు నేరుగా హుండీలో వేయవచ్చు. దీనివల్ల చిల్లర నాణేలు, నగదు వెంట తెచ్చుకోవాల్సిన ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ టీటీడీ విద్యాసంస్థల కోసం రూ.118.89 కోట్లు కేటాయించారు. అలాగే ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం, వకుళామాత ఆలయంలో ‘అక్షర గోవిందం’ (అక్షరాభ్యాసం) వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేశారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అలిపిరి వద్ద రూ.8 కోట్లతో అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.