వికారాబాద్‌లో విషాదం: ‘నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?’ అంటూ లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ధరూర్‌ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె, శనివారం ఉదయం తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆరేళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న దివ్య మరణంతో తోటి సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఆత్మహత్యకు ముందు దివ్య ఒక భావోద్వేగభరితమైన లేఖ రాశారు. “నా చావుకు ఎవరూ కారణం కాదు.. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు” అని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితమే ఆమె తండ్రి మరణించినట్లు సమాచారం. అయితే, ఈ లేఖ వెనుక బలమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు ఆమె సోదరి వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లి సంబంధం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులే ఆమెను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయని ప్రాథమికంగా తెలుస్తోంది.

దివ్య సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తితో సంబంధం కుదిరినప్పటి నుండి దివ్య తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి, కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆమె ఆందోళన చెందేవారు. అవతలి వ్యక్తి నుండి పదేపదే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం, లోకేషన్ పంపమని ఒత్తిడి చేయడం ఆమెను మానసికంగా కలచివేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె కాల్ డేటా ఆధారంగా వేధింపులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *