తేది: 27-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: గత పార్లమెంట్ సమావేశాల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య ప్రవేశపెట్టిన అనాథ వితంతువులు, ఒంటరి మహిళల (రక్షణ, పునరావాసం, సంక్షేమం) బిల్లు – 2025” కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లు అంశంపై భారత రాష్ట్రపతి గారు పూర్తి సమాచారం పొందిన అనంతరం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం లోక్‌సభలో ఈ బిల్లును పరిశీలించేందుకు సిఫార్సు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి గారు లోక్‌సభ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖ ద్వారా తెలియజేశారు.గతేడాది డిసెంబర్ 6న పార్లమెంట్‌లో మహిళల సంక్షేమం, గౌరవం, భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో రెండు ప్రైవేట్ మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఎంపీగా డా.కడియం కావ్య గుర్తింపు పొందారు. తాను ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడం పట్ల వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య హర్షం వ్యక్తం చేస్తూ, అనాథ వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ, పునరావాసం, సంక్షేమం కోసం ఈ బిల్లు కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు.ఈ బిల్లు కేవలం చట్టపరమైన ఆమోదంతోనే ఆగిపోకుండా, కార్యరూపం దాల్చి, అనాథ వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రత్యక్షంగా హక్కులు, భద్రత, సంక్షేమ ఫలాలు అందే వరకూ తాను నిరంతర పోరాటం చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.