ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఎట్టకేలకు విజయవాడలోని సిట్ (SIT) అధికారుల ఎదుట మంగళవారం లొంగిపోయారు. గత ఏడాది కాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారుల ముందుకు వచ్చారు. ఈ కేసులో ఆయన సోదరుడు ఇదివరకే అరెస్టు కాగా, అవినాష్ రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయి ఏడాది కాలంగా పరారీలో ఉన్నారు.
అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. “ఏడాది కాలంగా పరారీలో ఉండి, చట్టాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించే వ్యక్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు” అని సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఏ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లారని నిందితుడి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ముందుగా నిందితుడు లొంగిపోవాలని, ఆ తర్వాతే బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తామని తేల్చి చెప్పడంతో అవినాష్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది.
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ఇక దారిలేదని గ్రహించిన అవినాష్ రెడ్డి, మంగళవారం సాయంత్రం తన న్యాయవాదితో కలిసి విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకుని సరెండర్ అయ్యారు. ఆయన పరారీలో ఉన్న సమయంలో అధికారులు ఇప్పటికే ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ (Look Out Circular) కూడా జారీ చేశారు. అవినాష్ రెడ్డి లొంగుబాటుతో ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కుంభకోణానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు ఆయన విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.