ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వల్ల పొరుగు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లించి, కరువు ప్రాంతాలకు నీరందిస్తామని వివరించారు. గతంలో ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేస్తూ, ఈ అనుసంధానం రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
మే 15 నుంచే నారుమళ్లకు నీరు రాష్ట్రంలో నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో 793 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో, వచ్చే ఏడాది పంటల సీజన్‌ను ముందుకు జరపాలని నిర్ణయించారు. దీని ప్రకారం మే 15 నుంచే నారుమళ్లకు నీరందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. “ప్రతి ఎకరాకు నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడమే నా లక్ష్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై త్వరలోనే ఒక సమగ్ర ‘బ్లూప్రింట్’ విడుదల చేస్తామని, 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా జలవనరుల నిర్వహణ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
గత పాలనపై విమర్శలు.. ప్రాజెక్టుల పునరుద్ధరణ వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత పాలకులు విధ్వంసం చేశారని, దెబ్బతిన్న డయాఫ్రాం వాల్‌ను సరిచేసి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. జల సంరక్షణ చర్యల వల్ల భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగాయని, దీనివల్ల రూ.91 కోట్ల విద్యుత్ ఆదా అయిందని సభకు వివరించారు.