ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమేనా?: రేవంత్ ప్రభుత్వంపై ఖమ్మంలో కేటీఆర్ నిప్పులు

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇళ్లను కూల్చివేయడమేనా అని ప్రశ్నించారు. బాధితుల వద్ద ఉన్న భూమి పట్టాలు, ఇంటి పన్ను రశీదులు, విద్యుత్ కనెక్షన్ పత్రాలను పరిశీలించిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నా నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఇళ్లను కూల్చడం అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.

కూల్చివేతలకు గురైన బాధితులకు కేటీఆర్ కొండంత భరోసా ఇచ్చారు. “ఎవరూ అధైర్యపడకండి.. మళ్లీ ఇదే స్థలంలో మీకు ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది” అని ఆయన సంచలన హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం ఖమ్మంలోనే కాకుండా మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూల్చివేయడం ఈ ప్రభుత్వ రాక్షసత్వానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అన్యాయంపై తమ పోరాటం ఆగదని, శాసనసభ నుంచి సుప్రీంకోర్టు వరకు బాధితుల తరపున పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి బాధితుల పక్షాన నిలదీస్తామని చెప్పారు. పేదల పక్షాన గట్టిగా పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా సూచించారని, న్యాయం జరిగే వరకు బాధితులు ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చి గాంధీ విగ్రహం పెడతామనడం కూడా విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *