తేది:25-2-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ‘Arrive Alive – అరైవ్ ఆలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ D. V. శ్రీనివాస రావు మరియు అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ గారు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యువతే రేపటి భవిష్యత్తని, వారి చేతుల్లోనే సమాజ భద్రత ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 287 మంది ప్రాణాలు కోల్పోయి, 631 మంది గాయపడినట్లు వెల్లడించారు. “ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక చిన్నారి భవిష్యత్తు దాగి ఉంటుంది” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. వేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు.
విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలే సురక్షితమైన భవిష్యత్తుకు పునాది అని ఎస్పీ గారు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.