టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరగనున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఆధ్యాత్మిక బాట పట్టారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, సీనియర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ చెన్నైలోని ప్రసిద్ధ మారుండీశ్వరర్ ఆలయాన్ని సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ టోర్నీలో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం కావడంతో, విజయం కోసం వారు దైవ ఆశీస్సులు తీసుకున్నారు.
గత కొద్ది రోజులుగా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోవడమే కాకుండా, కడుపు ఇన్ఫెక్షన్‌తో శారీరకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, తిరిగి తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుని జట్టును విజయపథంలో నడిపించాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పొందేందుకే ఈ ఆధ్యాత్మిక పర్యటన చేసినట్లు సమాచారం.
కోట్లాది మంది భారతీయులు టీమిండియా సెమీస్‌కు చేరుకోవాలని ఆశిస్తున్న తరుణంలో, ఆటగాళ్లు ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి టీమిండియా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని అభిమానులు కూడా ప్రార్థిస్తున్నారు. మరి ఈ పూజలు ఫలించి అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో జింబాబ్వేపై విరుచుకుపడతారో లేదో వేచి చూడాలి.