బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) విజయం సాధించి, తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలు దేశవ్యాప్తంగా తిరిగి తెరుచుకుంటున్నాయి. గత 18 నెలలుగా మూతపడిన పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలు మళ్లీ జెండాలు ఎగురవేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న షేక్ హసీనా, తనపై ఉన్న చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొని మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత బీఎన్పీ ప్రభుత్వం షేక్ హసీనా పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2024 విద్యార్థుల ఉద్యమం సమయంలో జరిగిన హింసకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆమెనే బాధ్యురాలని, ఆ కేసుల్లో ఆమెకు మరణశిక్ష పడిందని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. హసీనాను భారత్ వెంటనే తమకు అప్పగించాలని ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా డిమాండ్ చేసింది. చట్టం ముందు ఆమెను దోషిగా నిలబెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న తరుణంలో, అవామీ లీగ్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హసీనా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ ప్రచారం మొదలుపెట్టాయి.
అవామీ లీగ్ కార్యకలాపాలు ప్రారంభం కావడంపై భిన్నమైన రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇతర ఇస్లామిక్ శక్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు అధికార బీఎన్పీయే వ్యూహాత్మకంగా అవామీ లీగ్‌కు కొంత రాజకీయ స్థలాన్ని కల్పిస్తోందని కొందరు భావిస్తుండగా, ఇది హసీనా తిరుగుబాటుకు సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, షేక్ హసీనా తిరిగి రాక మరియు అవామీ లీగ్ కార్యకలాపాలు దేశంలో కొత్త రాజకీయ అలజడికి దారితీసే అవకాశం ఉంది. అటు భారత్, ఇటు బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.