కుమ్మెర జాతర విషాదం: బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండ.. ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, పసికందు మరణానికి కారణమైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై కుల వివక్షతో దాడి చేయడం, చిన్నారిని కాలితో తన్నడం వల్ల ఆ పాప మరణించడం అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ తరపున రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, రూ.10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. పసికందు మరణానికి కారణమైన 8 మంది హంతకుల ముఠాను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిందితులపై హత్య కేసు నమోదు చేయకుండా బాధితులనే వేధిస్తున్నారని మండిపడ్డారు. “ఈ పాప ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ బిడ్డ అయితే పోలీసులు ఇలాగే వ్యవహరించేవారా?” అని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన చిన్నారికి కులం, మతం, అధికారం అంటే ఏంటో తెలియదని, కేవలం అహంకారంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హంతకులకు శిక్ష పడే వరకు బాధితుల పక్షాన పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతుండగా, మిగిలిన వారిని కూడా వెంటనే పట్టుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *