మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి ఫలితం, యూజీసీ గుర్తింపుతో మెదక్‌కు విద్యా ప్రతిష్ట – అదనపు ఎస్పీ హర్షం.

తేది:24-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు University Grants Commission (యూజీసీ) నుంచి స్వయంప్రతిపత్తి (Autonomous) హోదా మంజూరులో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కీలక పాత్ర పోషించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ విజ్ఞప్తి మేరకు ఆయన ఉన్నత విద్యాశాఖ మరియు Osmania University అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 30-01-2026న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించి, 2026-27 విద్యాసంవత్సరం నుండి 2030-31 వరకు ఐదు సంవత్సరాలపాటు స్వయంప్రతిపత్తి హోదా కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మేరకు అధికారిక సమాచారం కళాశాలకు అందిందన్నారు.
స్వయంప్రతిపత్తి హోదాతో కళాశాలకు విద్యా ప్రణాళికలు రూపొందించుకోవడం, పాఠ్యాంశాల్లో నూతన మార్పులు చేయడం, నైపుణ్యాధారిత కోర్సులు ప్రవేశపెట్టడం, పరీక్షా విధానాల్లో సంస్కరణలు చేపట్టడం వంటి విద్యా స్వేచ్ఛలు లభించనున్నాయి. విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధి అవకాశాల పెంపు, పరిశోధనాభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. National Education Policy 2020 అమలుకు కూడా ఇది బలమైన పునాది అవుతుందని వివరించారు.
ఇదిలా ఉండగా, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ నుంచి స్వయంప్రతిపత్తి హోదా లభించడం జిల్లాకే గర్వకారణమని అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదాతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ, జిల్లాలో ఉన్నత విద్యా రంగం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *