గోదావరి పుష్కరాలు–2027కు కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్.

తేది:24-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : రాబోయే గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ పుష్కరాలు జరిగే ప్రాంతాల పోలీస్ స్టేషన్ల ఎస్‌.ఐలు, సంబంధిత సి.ఐలు, డి.ఎస్‌.పిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్ శాఖ తరఫున చేపట్టాల్సిన సమగ్ర భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ & పార్కింగ్ నియంత్రణ, సీసీటీవీ కెమెరాల విస్తృత ఏర్పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు, విఐపీ ఘాట్‌లు, పుష్కర ఘాట్‌లు మరియు తాత్కాలిక స్నాన ఘాట్‌ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, రాబోయే పుష్కరాలను పురస్కరించుకొని జిల్లాకు ప్రతిరోజు సుమారు 15 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గత పుష్కరాల అనుభవాలను విశ్లేషించి, ఈసారి మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన స్నాన ఘాట్‌లు, మంగళ ఘాట్, విఐపీ ఘాట్‌లు, పుష్కర హారతి ప్రదేశాలు మరియు ఇరుకు రహదారులను హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించి అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని తెలిపారు.ప్రతి ఘాట్‌కు ప్రత్యేక అత్యవసర మార్గం కేటాయించి అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు సులభంగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసి, వాహనాల రాకపోకలకు వన్‌వే మరియు ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలని, పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డి.ఎస్‌.పిలు రఘు చందర్, రాములు, సి.ఐలు అనిల్ కుమార్, సుధాకర్, రామ్ నరసింహా రెడ్డి తదితరులు మరియు సంబంధిత ఎస్‌.ఐలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *