గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ‘పెద్ది’ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు. రత్నవేలు అద్భుతమైన విజన్ ప్రతి ఫ్రేమ్‌కు ప్రాణం పోస్తుందని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని చెర్రీ కొనియాడారు. సినిమాలోని ప్రతి దృశ్యం వెనుక రత్నవేలు మ్యాజిక్ ఉంటుందని చరణ్ ప్రశంసించడంతో, ఈ మూవీ విజువల్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అని అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి చిత్రబృందం ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రత్నవేలు, రామ్ చరణ్ ఉన్న లొకేషన్ స్టిల్‌ను పంచుకుంటూ.. “నిప్పులు చెరిగే ఫ్రేమ్స్ సిద్ధమవుతున్నాయి.. త్వరలో ఒక మెగా పవర్ బ్లాస్ట్ లోడ్ అవుతోంది” అని హింట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఏప్రిల్ 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ ఉంది. జగపతి బాబు ‘అప్పలసూరి’గా నటిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.