నిరుద్యోగులకు ఉగాది కానుక: జాబ్ క్యాలెండర్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారు. వచ్చే తెలుగు సంవత్సరం (పరాభవ నామ సంవత్సరం) ఉగాది నాటికి రాష్ట్రంలో సమగ్రమైన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరిస్తున్నామని, ఈ క్యాలెండర్‌తో నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుందని లోకేష్ వెల్లడించారు.

డీఎస్సీ అభ్యర్థులకు డబుల్ ధమాకా: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు. కొత్త జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ (DSC) పోస్టులను కూడా యాడ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం సాధారణ ఉద్యోగాలే కాకుండా టీచర్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడుతుందని పేర్కొన్నారు. దీనికి తోడు కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, సిబ్బంది జీతాల పెంపుదలపై కేంద్రంతో చర్చిస్తున్నామని వివరించారు.

వైసీపీ వైఖరిపై విమర్శలు: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టసభకు రావాలని ఎవరికీ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై చర్చించడం ప్రజాప్రతినిధులుగా వారి కనీస బాధ్యతని ఆయన హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడిని రోడ్డు మీదకు తీసుకురావడం, సభలో దేవుడి ఫోటోలతో నిరసన తెలపడం వంటి చర్యలు అత్యంత బాధాకరమని ఆయన మండిపడ్డారు. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల లడ్డూ వివాదంపై పూర్తిస్థాయిలో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *