అజిత్ పవార్ మృతి వెనుక భారీ కుట్ర: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామాకు రోహిత్ పవార్ డిమాండ్!

మహారాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం కేవలం ప్రమాదం కాదని, అది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యాకాండ అని ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెను కుట్ర దాగి ఉందని, విమానంలో పేలుడు తీవ్రత పెంచేలా బాంబుల్లా పనిచేసే అదనపు ఇంధన ట్యాంకులను అమర్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నిజనిజాలు బయటకు రావాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.

ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన ‘వీఎస్ఆర్ వెంచర్స్’ సంస్థకు, మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి మరియు ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. విచారణ పారదర్శకతపై తమకు నమ్మకం లేదని, కేంద్ర మంత్రి పదవిలో రామ్మోహన్ నాయుడు ఉంటే దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆయన తప్పుకుంటేనే నిష్పక్షపాత విచారణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని రోహిత్ పవార్ వేలెత్తి చూపారు. ప్రయాణానికి కొద్ది నిమిషాల ముందే పైలట్లను ఎందుకు మార్చారు? విమానంలోని వాయిస్ రికార్డర్ ఎందుకు పనిచేయలేదు? పాత ఇంజన్లతో విమానం నడిపేందుకు అధికారులు ఎలా అనుమతించారు? వంటి కీలక ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన రోహిత్ పవార్, అంతర్జాతీయ నిపుణులతో స్వతంత్ర కమిటీ వేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక దర్యాప్తు సంస్థల నివేదికలను తాము నమ్మే పరిస్థితిలో లేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *