హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కొండాపూర్‌లో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కబ్జాకు గురైన సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ.1,400 కోట్లు ఉంటుందని అంచనా. శనివారం క్షేత్రస్థాయికి చేరుకున్న అధికారులు ఆక్రమణలను తొలగించి, ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు “ఇది ప్రభుత్వ భూమి” అని తెలిపే బోర్డులను పాతారు.
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో 1993లో వేసిన లేఅవుట్‌లో ప్రజావసరాల కోసం కొన్ని స్థలాలను కేటాయించారు. ఇందులో జూనియర్ కళాశాల కోసం 5 ఎకరాలు, పాఠశాల కోసం ఒక ఎకరా, పార్కుల కోసం మరో ఎకరాకు పైగా స్థలం ఉంది. అయితే, కాలక్రమేణా బడాబాబులు ఈ విలువైన స్థలాలను కబ్జా చేసి అపార్ట్‌మెంట్లు, షెడ్లు నిర్మించారు. దీనిపై కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు హైడ్రా ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కాలనీ వాసుల ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు. అధికారులతో విచారణ జరిపించి, లేఅవుట్ ప్రకారం ఆ భూములు ప్రభుత్వానివేనని నిర్ధారించుకున్నాక ఈ యాక్షన్ తీసుకున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ భూ సమస్యను హైడ్రా పరిష్కరించడంతో రాజరాజేశ్వరి నగర్‌లోని సుమారు 5 వేల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూమిని కాపాడిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు