మెగా-అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరో అల్లు శిరీష్ వివాహం నయనిక రెడ్డితో మార్చి 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో, సోదరుడు అల్లు అర్జున్ తన ఫామ్‌హౌస్‌లో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో ఐకాన్ స్టార్ ఆతిథ్యం ప్రత్యేకంగా నిలిచింది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన జంట బ్లాక్ డ్రెస్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. చరణ్-బన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా, అల్లు అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే శిరీష్ తన స్నేహితులతో కలిసి దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ ముగించుకుని రాగా, ఇప్పుడు హైదరాబాద్‌లో కుటుంబ వేడుకలు మొదలయ్యాయి.
అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా శిరీష్ తన మావయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసి తొలి పెళ్లి పత్రికను అందజేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో అల్లు అరవింద్ నివాసంలో పనులు వేగవంతం అయ్యాయి. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.