కాంగ్రెస్ సర్కార్ హరీష్ రావు ఫైర్..!

వరంగల్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ ఫేజ్ -III పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంప్ హౌస్ 3 మోటార్లు పనిచేయట్లేదని పేర్కొన్నారు. గతేడాది మార్చి 18న మోటార్లు స్టార్ట్ చేస్తామని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడారన్నారు. కానీ అది జరగలేదన్నారు. మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 65 వేల ఎకరాలు ఎండిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు.

 

బీఆర్ఎస్ హయాంలో రూ.7,300 కోట్లు ఖర్చుపెట్టి దేవాదుల పనులు 80 శాతం పూర్తిచేశామని హరీశ్ రావు గుర్తుచేశారు. 30 వేల ఎకరాల భూ సేకరణ తమ హయాంలో జరిగిందని.. 3 వేల ఎకరాల భూ సేకరణ చేసి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే 2 లక్షల 40 వేల ఎకరాలకు నీరు అందేదని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకుండా రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

 

2026 మార్చి నాటికి దేవాదుల పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. డైలాగులు కొట్టిన మంత్రులు ఇప్పుడు ఎక్కడకు పోయారని నిలదీశారు. ‘వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. భీమ్ ఘనపూర్ ప్రాజెక్టులో 10 మోటార్లు ఉంటే 5 మోటార్లు మాత్రమే నడుపుతున్నారు. గండిరామారం లిఫ్ట్ బందు చేశారు. మీ సగం టైమ్ అయిపోయింది. ఒక్క ఎకరానికి అదనంగా నీరు ఇవ్వలేదు’ అని హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ హయాంతో తాము ఏకంగా 48 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. ‘మీరు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. యూరియా ఇవ్వక రైతులు గోస పడుతున్నారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఇరిగేషన్ లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి ఆయన గురువుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారు. అక్రమంగా కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి వదులుతున్నారు. బణకచర్లను ఆపడంలో ఫెయిల్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *