మాదకద్రవ్యాల నుంచి మిస్సింగ్ కేసుల వరకు డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర.పోలీస్ జాగిలాల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ.

తేది:19-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా పోలీస్ శాఖలో జాగిలాల విభాగం మరింత బలోపేతం అయింది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసిన పోలీస్ జాగిలాలను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాగిలాల ప్రతిభను అభినందిస్తూ, నేరాల ఛేదనలో వాటి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
శిక్షణ పొందిన భైరవ్ (స్నిఫర్) మరియు బృనో (ట్రాకర్) జాగిలాలు వివిధ రకాల నేరాల దర్యాప్తులో పోలీసులకు సమర్థవంతమైన సహకారం అందించనున్నాయి. స్నిఫర్ జాగిలం భైరవ్ మాదకద్రవ్యాల గుర్తింపు, పేలుడు పదార్థాల అన్వేషణలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండగా, ట్రాకర్ జాగిలం బృనో నేరస్థుల అడుగుజాడలను అనుసరించడం, గాలింపు చర్యల్లో పాల్గొనడం, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కఠినమైన శారీరక మరియు మానసిక శిక్షణతో సిద్ధమైన ఈ జాగిలాలు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాల విభాగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ మహేందర్, ఆర్ఐ శైలేంద్ర, ఆర్ఎస్ఐ భవాని కుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ జాగిలాల సేవలను మరింత విస్తరించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *