రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. గుజరాత్‌లోని ప్రసిద్ధ అంబాజీ ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ఆయన రూ. 27.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆలయానికి వచ్చే ఏ భక్తుడూ ఆకలితో వెళ్లకూడదనే ఉద్దేశంతో ‘జై అంబే తిథి భోజన్ యోజన’ కార్యక్రమానికి ఈ నిధులను కేటాయించారు. అంబానీ కుటుంబం ఇప్పటికే అనేక ప్రముఖ దేవాలయాలకు భారీగా విరాళాలు ఇస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ విరాళం వెనుక ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. అంబాజీ ఆలయ ట్రస్ట్ అంచనా ప్రకారం, ప్రతిరోజూ భక్తులకు రెండు పూటలా ఉచితంగా భోజనం అందించడానికి సుమారు రూ. 1.51 లక్షల ఖర్చు అవుతుంది. అనంత్ అంబానీ అందించిన ఈ రూ. 27.5 కోట్ల నిధులతో రాబోయే ఐదేళ్ల పాటు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ భోజన యోజనలో అనంత్ అంబానీ ప్రధాన దాతగా నిలిచారు.
అన్నదాన కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొదటి రోజే మొత్తం విరాళాలు రూ. 30 కోట్లు దాటడం విశేషం. అనంత్ అంబానీతో పాటు అహ్మదాబాద్‌కు చెందిన మరో భక్తుడు కూడా 35 ప్రత్యేక రోజుల భోజన సేవ కోసం రూ. 52 లక్షలు విరాళంగా అందించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో అంబాజీ దేవస్థాన్ ట్రస్ట్ సభ్యులు, జిల్లా అధికారులు మరియు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని అనంత్ అంబానీని ఘనంగా సత్కరించారు.