తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల సందడి: మార్చి 15లోపు భర్తీ పూర్తి!

తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, పార్టీ అధిష్టానంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల (మార్చి) 15వ తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని కీలక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయిందని, పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో రాహుల్ గాంధీ మరియు ఇతర అగ్రనేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభినందించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాల గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆరా తీశారని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, ఈ ఢిల్లీ పర్యటన మరియు నామినేటెడ్ పోస్టుల ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *