తేది:18-92-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
అప్పీల్‌కు 4 వారాల గడువు – తీర్పు అమలుకు తాత్కాలిక నిలుపుదల.
మెదక్ జిల్లా: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు 6 నెలల సాదా జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భూవివాదానికి సంబంధించి గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని, వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని పిటిషనర్ ఆరోపించారు.
వాదనలు, ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం కోర్టు ఆదేశాల అమలులో స్పష్టమైన విఫలం జరిగిందని అభిప్రాయపడింది. అధికారులైనా చట్టానికి లోబడే వ్యవస్థలో పనిచేయాల్సిందేనని, న్యాయస్థాన ఆదేశాలను నిర్లక్ష్యం చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే, కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునేందుకు 4 వారాల గడువు ఇస్తూ, జైలు శిక్ష అమలును కూడా నాలుగు వారాలపాటు నిలిపివేసింది.
ఈ తీర్పు పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, కోర్టు ఆదేశాల అమలులో అధికార యంత్రాంగం మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.