మళ్లీ తెలంగాణకు అమ్రపాలి ..! సిఎం రేవంత్‌తో మీటింగ్..!

ఐఏఎస్‌ అధికారి కాటా అమ్రపాలి మళ్లీ తెలంగాణకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె పని చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆమె సీఎంఓగా వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అలాట్‌ అయ్యారు.

 

వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఆమ్రపాలి విధులు నిర్వహించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంత కాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌కు వెళ్ళిన అమ్రపాలి 2019 అక్టోబర్‌ 29 నుంచి కేంద్ర క్యాబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు. అనంతరం 2020 సెప్టెంబరు 14న పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.

 

కేంద్ర సర్వీస్‌లో డిప్యూటేషన్‌ పూర్తికావడంతో అమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేసిన ఆమె సిఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. గతంలో ప్రధాన మంత్రి ఆఫీసులో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శేషాద్రి సూచనల మేరకు ఆమ్రపాలి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత సిఎం రేవంత్ రెడ్డి.. తన ప్రిన్సిపాల్ సెక్రటరీగా సీనియర్ ఐఏస్ అధికారి శేషాద్రిని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆఫీసర్ ఆమ్రపాలి కూడా సిఎంఓలోకి చేరవచ్చనేది సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ మరికొందరు మాత్రం ఆమె ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓఎస్డీగా లేదా దేశ రాజధానిలో రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టవచ్చునని చెబుతున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆమ్రపాలి నియామకంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *